Wednesday, March 18, 2015

Ramadaasu Keerthana-1

Ikshvaku_Kulatilaka_Ikanaina_Palukave

ఇక్ష్వాకు కులతిలకా ఇకనైన పలుకవే రామచంద్రా
నన్ను రక్షింప కున్నను రక్షకు లెవరింక రామచంద్రా
చుట్టు ప్రాకారములు సొంపుతో కట్టిస్తి రామచంద్రా
ప్రాకారముకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా
భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్రా
పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా
శత్రుఘ్నునకు చేయిస్తి బంగారు మొలతాడు రామచంద్రా
మొల త్రాటికి పట్టె మొహరీలు పదివేలు రామచంద్రా
లక్ష్మణునకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్రా
పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా
సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా
పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా
కలికి తురాయి నీకు మెలుకువగ చేయిస్తి రామచంద్రా
నీవు కులుకుచు తిరిగేవు ఎవరబ్బ సొమ్మని రామచంద్రా
నీ తండ్రి దశరథ మహరాజు పెట్టెనా రామచంద్రా
లేక నీ మామ జనక మహరాజు పంపెనా రామచంద్రా
అబ్బ తిట్టితినని ఆయాస పడవద్దు రామచంద్రా
దెబ్బల కోర్వక అబ్బ తిట్టితినయ్యా రామచంద్రా
భక్తులందరిని పరిపాలించెడి శ్రీ రామచంద్రా
నీవు క్షేమముగ శ్రీ రామదాసుని యేలుము రామచంద్రా